మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (MPVL), ఎన్నికల ఇంక్‌ను తయారు చేసే ఏకైక కంపెనీ.
నేషనల్ ఫిజికల్ ల్యాబరేటరీస్ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించారు. ఈ ఫ్యాక్టరీని మైసూర్ మహరాజు కృష్ణరాజ వడయార్-4 , 1937లోనే స్థాపించారు. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఇంకునే దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వేసిన వెంటనే చెరిగిపోదు.
మన దేశంలో 1962 లోక్‌సభ ఎన్నికల నుంచి సిరా చుక్క వాడకం మొదలైంది. నాటి నుంచి నేటిదాకా కర్ణాటక ప్రభుత్వ సంస్థ మైసూర్ పెయింట్సే దీన్ని సరఫరా చేస్తోంది. 30 పై చిలుకు దేశాలకు ఈ ఇంకును ఎగుమతి చేస్తోంది కూడా.
ప్రత్యేకత ఇదే..
ఓటేసినట్లు రుజువుగా ఓటరు ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. చూపుడు వేలు లేకుంటే ఎడమ చేతిలోని ఇతర వేలిపై వేస్తారు. ఎడమ చేయే లేకుంటే కుడిచేతి వేళ్లలో దేనికైనా వేస్తారు. రెండు చేతులు లేకుంటే? ఎడమ లేదా కుడి చేయి చివరి భాగాలకు సిరా గుర్తు వేయాలని ఈసీ చెబుతోంది.
సిరా చుక్కలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది రుద్దిన 40 సెకన్లలోపే ఆరిపోతుంది. చర్మంతో చర్య జరిపి బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దాంతో త్వరగా చెరగదు. ఇంకు గుర్తు సాధారణంగా చర్మంపై మూడు రోజుల దాకా ఉంటుంది. గోరుపై మాత్రం వారాల పాటు ఉంటుంది.
5.1 మిల్లీలీటర్ల సీసాలోని ఇంకుతో సుమారు 700 మందికి గుర్తు వేయవచ్చు.
మామూలుగా ఎన్నికల్లోనే వాడే ఈ ఇంకును ఇతరత్రా వాడేందుకు ఒకేసారి ఈసీ అనుమతించింది. అదెప్పుడంటే.. కరోనా వ్యాప్తి సమయంలో. కోవిడ్ బారిన పడి క్వారెంటైన్లో ఉన్నవారిని గుర్తించడానికి పలు రాష్ట్రాలు ఈ ఇంకును ఉపయోగించాయి.
హైదరాబాద్‌లోనూ సిరా ఇంకును తయారు చేస్తారు. నగంరోలని రాయుడు ల్యాబరేటరీస్‌లోనూ ఎన్నికల సిరా ఇంకు తయారవుతోంది. ఈ ఇంక్‌ను స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసే సమయంలో గుర్తు పెట్టేందుకు యూజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో తయారయ్యే సిరా కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. చాలా వరకు ఆఫ్రికన్ దేశాలకు హైదరాబాద్ నుంచే ఇంక్ సరఫరా అవుతుంది.
コメント