నిష్పక్షపాత ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తోంది. దీన్నే ఎన్నికల కోడ్ అంటారు. అంటే ప్రతి ఒక్కరూ కొన్ని నిబంధనలకు అనుసరించి నడుచుకోవాల్సివుంటుంది.
ముఖ్యంగా ఎన్నికల కోడ్ వల్ల నగదు రవాణాపై ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఉండటంతో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇందులో సామాన్యుల డబ్బు కొంత వుంటుంది. సరైన పత్రాలు లేకపోతే.. ఎవరి డబ్బైనా అధికారులు స్వాధీనం చేసుకోవాల్సిందేనని నిబంధనలు సూచిస్తున్నాయి.
50 వేల రూపాయలకన్నా ఒక్క పైసా ఎక్కువ మీ వద్ద ఉన్నా అధికారులను పూర్తిగా వివరణ ఇవ్వాల్సిందే.
ఎన్నికల కోడ్ కింద ఒక్క నగదే కాదు.. బంగారం, వెండి, వజ్రాభరణాలు, విలువైన వస్తువులు ఇలా ఏవైనా సరే.. అనుమానం వస్తే స్వాధీనం చేసుకుంటారు అధికారులు.
ఎన్నికల కోడ్ నిబంధనలు, సూచనలు
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదాని, ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు ఉండకూడదు. ప్రభుత్వ భవనాలు, ఆస్థుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, పోస్టర్లు, వాల్ పోస్టర్లు తొలగించాలి. బస్డాండ్లు, రైల్వే స్టేషన్లు, రహదారులు, బస్సులు, విద్యుత్ స్థంభాలు, మున్సిపల్ కార్యాలయాల స్థలాల్లో ప్రకటనలు, హోర్డింగులు ఉండకూడదు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధుల ఫోటోలు తొలగించాలి. మంత్రుల అధికార వాహనాల వినియోగం నిలిపివేయాలి.
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది బదిలీలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. మంత్రులు, రాజకీయ నేతలతో అధికారుల వీడియో కాన్ఫరెన్సులు ఉండవు. లబ్దిదారులకు ఇచ్చే పత్రాలపై ముఖ్యమంత్రి , మంత్రుల ఫోటోలు ఉండకూడదు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. దేవాలయం, మసీదు, ప్రార్ధనా స్థలాల్లో ప్రచారం చేయకూడదు. కులాలు, వర్గాల ఆధారంగా ఓటు అడగకూడదు.
పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం నిషిద్ధం. ఓటింగుకు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం, బహిరంగసభలపై నిషేధముంటుంది. ర్యాలీలు, సమావేశాల ముందస్తు సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి. లౌడ్ స్పీకర్ వినియోగానికి అనుమతి తీసుకోవాలి.
పోలింగ్ రోజు సూచనలు
రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులు, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులతో సహకరించాలి. ఓటర్లకు ఇచ్చే స్లిప్‌లు సాధారణ కాగితంపై ఉండాలి. ఏ విధమైన పార్టీ గుర్తులు, అభ్యర్ధి పేరు, పార్టీ పేరు ఉండకూడదు. ఓటింగుకు 48 గంటల ముందు మద్యంపై నిషేధం ఉంటుంది.
コメント